టీడీపీకి కలగానే కర్నూలు..ఈ సారి ఛాన్స్ ఉంటుందా?

కర్నూలు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అందులో కర్నూలు అసెంబ్లీ సీటులో వరుసగా గెలుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ టి‌డి‌పికి గెలుపు అనేది కలగానే మిగిలిపోయింది. అసలు గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోతూ ఉంది. టి‌డి‌పి ఇక్కడ గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే. 1983, 1999 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది.

2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే 2004లో కేవలం 2,473 ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. 2009లో పొత్తులో భాగంగా ఈ సీటు సి‌పి‌ఐకి ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. 2014 ఎన్నికల్లో టి‌డి‌పికి మరింత బ్యాడ్ లక్ ఎదురైంది. 3,479 ఓట్ల తేడాతో వైసీపీ చేతిలో ఓడింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉంది..దీంతో కర్నూలులో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. చివరి వరకు టి‌డి‌పి పోరాడింది.

చివరికి టి‌డి‌పి నుంచి టి‌జి భరత్ పోటీ చేసి..వైసీపీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ చేతిలో 5,353 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఇలా మూడుసార్లు తక్కువ ఓట్లతోనే టి‌డి‌పి ఓడిపోయింది.

అంటే కర్నూలులో టి‌డి‌పి బ్యాడ్ లక్ ఎలా ఉందో చూసుకోవచ్చు. కానీ ఈ సారి గెలవాలనే పట్టుదలతో టి‌డి‌పి ఉంది. ఇంచార్జ్ భరత్ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అటు వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది. ఎమ్మెల్యే హఫీజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య పోరు ఉంది. ఇది వైసీపీకి మైనస్ అవుతుంది. కాకపోతే కర్నూలు వైసీపీ కంచుకోట కాబట్టి..భరత్ కాస్త కష్టపడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి.