ఎంపీ సీట్లపై జగన్ ఫోకస్..మార్పులు ఉంటాయా?

25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేసి..22 ఎంపీ సీట్లని గెలిపించుకున్న విషయం తెలిసిందే. మరి 22 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సాధించింది ఏమైనా ఉందా? అంటే కేంద్రంలో బి‌జే‌పికి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల జగన్‌ పెద్దగా ఏది డిమాండ్ చేయలేని పరిస్తితి. అందుకే ఆ విషయం జగన్ ముందే చెప్పేశారు.

కానీ సాధ్యమైన మేర బి‌జే‌పితో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావల్సిన పనులు చేయించుకుంటున్నారు. అయితే ఈ సారి మాత్రం కేంద్రంలో బి‌జే‌పి ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టమని, ఇతర పార్టీల మద్ధతు కావాల్సి ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మళ్ళీ జగన్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే..కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే జగన్ మళ్ళీ ఎంపీ సీట్లని ఎక్కువ గెలుచుకోవడానికి చూస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీలు అందరికీ సీట్లు ఇవ్వడం అనేది కష్టం.

ఎందుకంటే కొందరిపై వ్యతిరేకత ఉంది..పైగా కొందరు ఎంపీలనే విషయం ప్రజలకు కూడా పెద్దగా తెలియదు అంటే..పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా అలాంటి వారిని జగన్ సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా కొందరిని అసెంబ్లీ సీట్లలో పోటీ చేయించే ఛాన్స్ కూడా ఉంది.

దాదాపు ఎంపీ సీట్లలో మార్పులు ఎక్కువగా జరిగేలా ఉన్నాయి. పైగా టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఎంపీ సీట్లలో వైసీపీ గెలుపు అనేది కాస్త కష్టమైన పని. అందుకే పొత్తుకు తగ్గట్టు బలమైన అభ్యర్ధులని నిలపాలి..కాబట్టి ఈ సారి అభ్యర్ధులు మారే అవకాశాలు ఉన్నాయి.