అసెంబ్లీలో జగన్ బిగ్ ప్లాన్..టీడీపీ అవుట్?

చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయం దగ్గరపడటం, టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడం, రాజకీయంగా పైచేయి సాధించి మళ్ళీ ప్రజల మద్ధతు గెలవాలని చూస్తున్న జగన్‌..ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. బాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం కక్ష సాధించడం లేదని, తప్పు చేసి జైలుకు వెళ్లారని నిరూపించే విధంగా జగన్..అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఇదే సమయంలో ఈ సమావేశాలు టి‌డి‌పి హాజరు అవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టి‌డి‌పి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలా? లేదా? అనేది తేల్చుకుంటుంది. ఎలాగో బాబు అసెంబ్లీకి రావడం లేదు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో టి‌డి‌పి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే ఎంతవరకు వైసీపీకి ధీటుగా మాట్లాడతారో చెప్పలేం. పైగా బాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఈ సందర్భంలో వైసీపీ పూర్తిగా బాబుపై ఎటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు టి‌డి‌పి ఎమ్మెల్యేలకు పెద్దగా మాట్లాడే అవకాశాలు రాకపోవచ్చు.

ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని అనుకుంటే..బాబు అరెస్ట్ ఖండిస్తూ నిరసనలు తెలియజేయడానికి వెళ్ళాలి.అప్పుడు సభనుంచి సస్పెండ్ అవుతారు. ఇలా చేస్తే కనీసం బాబు కోసం పోరాటం చేశామనేది కనిపిస్తుందని టి‌డి‌పి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి నిరసనలు తెలియజేసే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిఘటించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి టి‌డి‌పి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా? లేదా? అనేది.