దేవ‌రలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్‌.. ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంట‌న్న లేటెస్ట్ మూవీ `దేవ‌ర‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ రోల్ ను పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే నేడు సైఫ్ అలీ ఖాన్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా దేవ‌ర నుండి ఆయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. ఇందులో సైఫ్ భ‌య‌క‌ర‌మైన `భైరా` పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఫస్ట్ లుక్ ను గ‌మ‌నిస్తే.. భారీ జుట్టుతో సీరియ‌స్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ సైఫ్ అలీ ఖాన్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు, కిందన సముద్రం, అందులో పడవల్లో వెళ్తున్న కొంతమందిని చూపించారు. సైఫ్ ఫ‌స్ట్ లుక్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ఇది. నేష‌న‌ల్ వైడ్ గా ఈ మూవీపై అంచ‌నాలు ఉన్నాయి. షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కలై అరసన్, చైత్ర రాయ్, మురళీ శర్మ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.