ఆ మూడు మైన‌స్ లు లేకుంటే ర‌జ‌నీ `జైల‌ర్‌` వేరె లెవ‌ల్‌.. అంతే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం `జైల‌ర్‌` భారీ అంచ‌నాల నడుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్, సునీల్‌, యోగిబాబు తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఉదయం 9 గంటల నుంచి తొలి ఆట మొదలైంది. అయితే ఇప్ప‌టికే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప‌డ‌టంతో.. సినిమా చూసిన ఆడియోన్స్ సోష‌ల్ మీడియా ద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఆల్మోస్ట్ జైల‌ర్ కు పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగి అయిన టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న అతని లైఫ్ ను మాఫియా డిస్టర్బ్ చేస్తుంది. ముత్తువేల్ కొడుకుని అతి కిరాతకంగా చంపేస్తారు. దాంతో ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు. బడా మాఫియాతో ముత్తువేల్ ఎలా పోరాడి గెలిచాడు అన్న‌దే జైల‌ర్‌.

అయితే ర‌జ‌నీ వ‌న్ మాన్ షో చేశాడు. నెల్సన్ మార్క్ కామెడీ, ర‌జ‌నీకాంత్ క్యారెక్టరైజేషన్, డార్క్ కామెడీ, సెకండాఫ్ లో వ‌చ్చే ట్విస్ట్ లు, ఇంట‌ర్వెల్ ఎపిసోడ్, యాక్ష‌న్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయ‌ని అంటున్నారు. అయితే ఈ సినిమాకు మైన‌స్ లు కూడా వినిపిస్తున్నాడు. ఈ మూవీ ఫ‌స్టాఫ్ చాలా స్లోగా సాగుతుంది. ఎంత‌లా అంటే.. మొద‌టి 40 నిమిషాలు చూశాక‌ రజినీకాంత్ కి మళ్ళీ ఫ్లాపే అన్న భావ‌న కూడా క‌లుగుతుంది. ఇది పెద్ద మైన‌స్ గా చెప్పుకోవాలి. అలాగే ర‌జ‌నీ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా క్లైమాక్స్ లేక‌పోవ‌డం నిరాశ‌ను క‌లిగిస్తుంద‌ని అంటున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంద‌రు బాగుందని చెబుతున్నా.. కొంద‌రు మాత్రం అతిగా వాయించేశాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా ఈ మూడు మైన‌స్ లు లేకుంటే జైల‌ర్ వేరె లెవ‌ల్.. అంతే!!