సీటు తేలితే షర్మిల రెడీ..కాంగ్రెస్‌లో విలీనం ఖాయం.!

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి వైఎస్ షర్మిల…వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పాదయాత్ర కూడా చేశారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆమె సైలెంట్ అయ్యారు. కేవలం సోషల్ మీడియాలోనే కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో షర్మిల రాజకీయంగా ఒంటరిగా ముందుకెళ్లడం కష్టమని తేలింది. ఆమె పార్టీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ప్రధాన పోటీ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ ల మధ్య జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో బి‌జే‌పి గట్టి ఫైట్ ఇస్తుంది. ఇక షర్మిల పార్టీ పెద్దగా ప్రభావం చూపదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు మాత్రం చీల్చగలరు. ఆఖరికి షర్మిల పోటీ చేసిన గెలుపు డౌటే. ఈ నేపథ్యంలో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ కథనాలు నిజమే అని పలువురు కాంగ్రెస్ నేతలు తేల్చేశారు. ఇప్పటికే విలీనంకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. కాకపోతే షర్మిల పోటీ చేసే సీటు తేలితే విలీనం జరిగిపోనుంది. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించారు. ఇక కాంగ్రెస్ లోకి వెళ్ళి పాలేరు నుంచి బరిలో ఉంటారా? లేక సికింద్రాబాద్ సీటులో పోటీ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

దాదాపు షర్మిల పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమని తేలింది. ఇప్పటికే జగన్ సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఆయన కొత్తగూడెంలో పోటీ చేస్తున్నారు. ఇటు షర్మిల పాలేరులో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఆ సీటు ఫిక్స్ అయితే..ఈ నెలలోనే ఆమె కాంగ్రెస్ లోకి రావడం ఖాయమవుతుంది.