టీటీడీ ఛైర్మన్‌గా కొత్త పేరు.. మార్పు నిజమేనా….!

తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ వివాదం కూడా కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు సార్లు మాజీ ఎంపీ, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్లైంది. తమ ప్రభుత్వంలో బీసీలకు అవకాశం కల్పించామని… జగన్ మాత్రం సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారని విమర్శలు చేస్తున్నారు. దీనికి తోటు వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా కూడా జగన్ నియమించారు. దీంతో ఎక్కువ సమయాన్ని విశాఖలోనే గడిపేస్తున్నారు సుబ్బారెడ్డి. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఉత్తరాంధ్రలో పార్టీని మళ్లీ గెలుపు దిశగా నడిపించడం, నేతల మధ్య ఉన్న విబేధాలను సరిపెట్టడం… ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి కార్యక్రమాలపై వైవీ సుబ్బారెడ్డి ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. దీంతో టీటీడీని పట్టించుకోవడం లేదనే అపవాదు కూడా వైవీ సుబ్బారెడ్డి మూటగట్టుకున్నట్లైంది.

అదే సమయంలో టీటీడీపై వస్తున్న ఆరోపణలకు ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్తున్నారు. దీంతో ఛైర్మన్ ఏమయ్యారు అంటూ నిలదీస్తున్నాయి ధార్మక సంస్థలు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్‌గా కొత్త వ్యక్తిని నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ సర్కార్ గడువు 2024 ఏప్రిల్ నెల వరకు ఉంది. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగూ తామే అధికారంలోకి వస్తాం కాబట్టి… ఇప్పుడు నియమించిన వ్యక్తిని కొనసాగించవచ్చు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకే వైవీ స్థానంలో కొత్త వ్యక్తి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును టీటీడీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీశైల బోర్డు ఛైర్మన్‌గా కూడా పని చేసిన అనుభవం, రాజకీయాల్లో సౌమ్యుడిగా గుర్తింపు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. పైగా ప్రకాశం జిల్లాలో వైవీ సారథ్యంలోనే శిద్ధా కూడా కొనసాగుతున్నారు కాబట్టి.. ఆయనకు ఇస్తే… ఎలాంటి సమస్య రాదని జగన్ భావిస్తున్నట్లు ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత.. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సరైన గుర్తింపు లేదనే అపవాదు కూడా ఉంది. దానికి కూడా శిద్ధాకు పదవి ఇవ్వడంతో చెక్ పెట్టినట్లు అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి శిద్ధా రాఘవరావుకు టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి వస్తుందా రాదా అనేది చూడాలి.