ఒంగోలు ఎంపీ అభ్యర్థులు ఎవరూ….?

ఒంగోలు పార్లమెంట్ స్థానం తొలినుంచి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మారింది. ఒంగోలు పార్లమెంట్ అంటే టీడీపీకి ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేవలం ఒకటి రెండు సార్లు తప్ప… ఒంగోలులో టీడీపీ గెలిచిందే లేదు. అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ జెండా… ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఒంగోలులో గెలవాలని చంద్రబాబు భావిస్తుంటే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు పార్లమెంట్‌ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. 2014లో వైవీ సుబ్బారెడ్డి గెలవగా… 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. వాస్తవానికి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరనే చెప్పాలి. 2014లో చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. ఇక 2019 ఎన్నికలకు ముందు మాగుంట వైసీపీలో చేరడంతో… ఆయన స్థానంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును బరిలోకి దింపారు. వాస్తవానికి దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సై అన్న శిద్ధా రాఘవరావు.. అయిష్టంగానే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఫలితం కూడా అలాగే వచ్చింది. ఏకంగా 2 లక్షల ఓట్ల తేడాతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు.

ఆ తర్వాత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడంతో.. టీడీపీని నడిపే నేత కరువయ్యారు. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షునిగా డా.నూకసాని బాలాజీ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎంపీగా పోటీ చేసే సత్తా లేదు అనేది బహిరంగ రహస్యం. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు పోటీ చేసే అభ్యర్థి ఎవరూ అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు ముందస్తు ఎన్నికలంటూ పుకార్లు షికారు చేస్తుంటే.. ఇప్పటి వరకు అభ్యర్థి పేరు తెలియకపోవడంతో… ఓట్లు ఎలా అడగాలి అనేది టీడీపీ శ్రేణుల ప్రశ్న. అభ్యర్థి పేరు ముందుగా ప్రకటిస్తే… ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి… పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుందని…. చివరి నిమిషంలో ప్రకటిస్తే.. నియోజకవర్గం మొత్తం అభ్యర్థి తిరగడం కష్టమవుతుందనే మాట కూడా వినిపిస్తోంది.

ఇక వైసీపీలో కూడా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి పోటీ చేసే పరిస్థితి లేదనే మాట వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. రాఘవ బెయిల్ కోసం మాగుంట తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం రావడం లేదు. మరోవైపు వైసీపీ నుంచి మాగుంట కుటుంబానికి ఎలాంటి అండ రావడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో వైసీపీ అధిష్ఠానంపై మాగుంట ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో మరోసారి ఎంపీగా మాగుంట చేసే పరిస్ఖితి లేదని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఎంపీ, ప్రస్తుత టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఒంగోలు నుంచి ఎవరు పోటీ చేస్తారో తేలాలంటే… మరికొంత కాలం ఆగాల్సిందే.