కేసీఆర్ చుట్టూ విమర్శలు… ఇలా అయితే ఎలా సారూ…!

రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కి ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే ఆయన పక్క రాష్ట్రంలోరాజకీయాలు చేస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసే తీరక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి మహారాష్ట్రకు వెళుతున్నారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాలు బయటపెట్టని సీఎం ఈ నెల 3న మహారాష్ట్ర పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కేసిఆర్‌కు రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల మీద లేదనే విమర్శలు వస్తున్నారు. ఓ వైపు వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ప్రగతి భవన్‌లో రాజకీయ భేటీలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధితుల్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సీఎం కేసిఆర్ కనీసం ఏరియల్ రివ్యూ కూడా చేయకపోవడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. భీకర వర్షాలతో తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలతో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రళయమే వచ్చింది. వరదలు ముంచెత్తి ఊళ్లకు ఊళ్లు నీట మునిగిపోయాయి.

మోరంచపల్లి, జంపన్న వాగు పరిసర గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వరదలు కొట్టిన దెబ్బకు సర్వం కోల్పోయి తల్లడిల్లుతున్నారు. ఆ గ్రామాల పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా కన్నీరు ఆగడం లేదు. ఆగమైన ఆ గ్రామాలను నిలబెట్టి ప్రజల కన్నీరు తుడిచి భరోసా ఇవ్వాల్సిన కేసీఆర్కాలు బయట పెట్టలేదు. బాధిత ప్రాంతాలకు వెళ్లి పర్యటించలేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్‌లో పక్క రాష్ట్రంలో పార్టీ విస్తరణ, చేరికల మీద చర్చలు చేస్తున్నారు. బాధితులను ఆదుకోవడం కంటే అసెంబ్లీ సమావేశాల కోసం వ్యూహరచన మీద దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలపై రివ్యూలు వదిలేసి యూపీ నుంచి భీమ్ ఆర్మీ నేత వస్తే చర్చలు జరిపారు. ఇంకా వరద బాధిత గ్రామాలు కష్టాల్లోనే ఉండగా కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పొలిటికల్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. కేసీఆర్‌కు ప్రజల ఇబ్బందుల మీద కంటే ఎన్నికలు, పార్టీ విస్తరణ మీదే ధ్యాస ఎక్కువనే విమర్శలు పెరిగాయి. వరదల్లో ప్రభుత్వం కొట్టుకుపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వరదలు రావడానికి నాలుగైదు రోజుల ముందు నుంచే వాతారవణ నిపుణుల హెచ్చరించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతూంటే ఏమీ చేయలేక పోయారు. జేసీబీతో గేట్లను బద్దలు కొట్టించారు. ముఖ్యంగా భారీ వర్షాలు పడి వరదలు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లో సైతం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. గ్రామస్తులను రక్షించే ప్రయత్నం చేయలేదు. మోరంచపల్లె గ్రామం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ ప్రజలు చెట్లు, పుట్టల మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటే… ప్రభుత్వం స్పందించడానికి పది గంటలపైనే సమయం పట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. రాత్రంతా ప్రజలు వరదల్లో చిక్కుకుంటే చివరికి ఆర్మీ హెలికాఫ్టర్లు రంగంలోకి దింపడానికి కూడా త్వరగా నిర్ణయం తీసుకోలేక పోయారు.

ఇక ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో పర్యటించారు. కడెం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే.. తనకు అవగాహన లేదని.. తన శాఖ గురించి అడగాలనడం పై దుమారం రేగింది. మరి వరంగల్ పరిస్థితి ఏమిటని అడిగితే.. అవసరం అయితే తాను కూడా వెళ్తానన్నారు. కానీ కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లలేదు. ఏ రకంగా చూసినా విపత్తుల మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యాన్ని చూపించిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక భద్రాద్రిలో కరకట్టల నిర్మాణం చేస్తామని ప్రకటించి ప్రభుత్వం విస్మరించడం వల్ల మరోమారు భద్రాద్రి నీట మునిగిందనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

వరద ముంపులో ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఉన్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాల ప్రకటన వచ్చింది. కేబినెట్ భేటీ అయ్యింది. ఇక నిత్యం ప్రగతి భవన్‌లో రాజకీయ పరమైన సమవేశాలను కేసీఆర్ నిర్వహించారు. ఓ వైపు వరదలతో ఊహించనంత నష్టం జరగబోతోందని తెలిస్తే.. వీలైనంత నష్టం తగ్గించడానికి ప్రయత్నించాల్సింది పోయి.. రాజకీయ వ్యూహాల్లో మునిగిపోవడం ఏమిటని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక సహాయ కార్యక్రమాల విషయంలోనూ అంత చురుకుదనం లేదని బాధితుల ఆరోపణ. ప్రజల ప్రాణాల కంటే కేసీఆర్‌కు రాజకీయాలే ఎక్కువయ్యాయి అని ఫైర్ అవుతున్నాయి.