తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న అంటువ్యాధులు… బీ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు, కళ్ల కలకతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో.. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంటువ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, కలుషిత నీళ్లు అంటు వ్యాధులకు కారణమని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో అంటు వ్యాధులు కలకలం రేపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో.. వైరల్‌ ఫీవర్లు ప్రబలుతున్నాయి. మరోవైపు.. కళ్ల కలక వేగంగా వ్యాపిస్తోంది. దీంతో.. కంటి ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో దురద, దద్దుర్లు, కళ్ల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీళ్లు కలుషితంగా మారడంతో.. అంటు వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి.

వాతావరణంలో తీవ్రమైన మార్పులతో.. గాలిలో బ్యాక్టీరియా, వైరస్‌ క్రిములు విపరీపంగా పెరిగి అతి సున్నితమైన కళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ వైరస్‌, బ్యాక్టీరియా ప్రభావం వల్ల కళ్ల కలకల సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా 5 నుంచి 15ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. కళ్ల కలకతో.. కళ్లు ఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం, కంటి రెప్పల వాపు, నిద్రలేచినప్పుడు కళ్ల రెప్పలు అంటుకుపోవడం, కంటి నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. బ్యాక్టీరియా వల్ల సంభవిస్తే వారం రోజుల పాటు, వైరస్‌ వల్ల సంభవిస్తే మూడు వారాల పాటు ప్రభావం ఉంటుంది. పసికందులకు, రోజులు, నెలల పిల్లలకు ఇది ప్రమాదకం.

ఇక.. హైదరాబాద్‌ వాసులను కళ్ల కలక వ్యాధి పట్టి పీడిస్తోంది. కళ్ల కలకతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారం రోజుల్లోనే.. 400 మందికి సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక.. ఆదివారం ఒక్కరోజే 100కు పైగా ఐ ఫ్లూ వైరస్‌ కేసులు సరోజినీ కంటి ఆస్పత్రికి వచ్చాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు.. విషజ్వరాలతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. డెంగీ, మలేరియా లాంటి వైరల్‌ ఫీవర్లతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధుల కాలం కావడం.. వాతావరణంలో మార్పులతో.. విష జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒళ్లు నొప్పులు, జ్వరంతో జనాలు అల్లాడిపోతున్నారు. సీజనల్‌ వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయని.. ప్రజలు తమ ఆరోగ్యంపై వీలైనంత శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

కళ్ల కలక, వైరల్‌ జ్వరాలను అశ్రద్ధ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. సొంత వైద్యం చేసుకోవద్దని.. అనారోగ్యం బారిన పడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.