మణిపుర్ ఘటనపై సుప్రీం సీరియస్… మరి కేంద్రం వివరణ..?

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టు. మహిళలపై జరిగిన ఈ దారుణం అత్యంత భయంకరమైందని అభిప్రాయపడింది. ఇంతకీ.. అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలేంటి? దానిపై కేంద్రం ఇచ్చుకున్న వివరణ ఏంటి?

మణిపూర్‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అన్ని రోజులు పట్టిందా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. సాయుధ మూకలకు మహిళల్ని అప్పగించిన పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది ధర్మాసనం.

మణిపుర్‌లో మహిళలపై చోటు చేసుకున్న దారుణాలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టిన ధర్మాసనం.. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ ఘోరం మే 4న జరిగితే.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు 14 రోజులు ఎందుకు పట్టింది?. అంతవరకు పోలీసులు ఏం చేశారు? నెల తర్వాత దాన్ని మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు? అనే ప్రశ్నలను సంధించింది సుప్రీంకోర్టు.

మణిపుర్‌ ఘటన భయంకరమైనదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బాధిత మహిళలను సాయుధ మూకకు పోలీసులు అప్పగించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడాన్ని మేం కోరుకోవడం లేదని తెలిపింది. అయితే, న్యాయస్థానం సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తమకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్‌.వెంకటరమణి అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే సమయం మించిపోతోందని.. సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఇప్పటివరకు నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మణిపుర్ బాధిత కుటుంబాలకు ఏవిధమైన సాయం అందుతుందో? తాము కూడా తెలుసుకోవాలనుకుంటున్నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా బాధిత మహిళల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ దాచిపెట్టడం లేదని.. విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

ప్రభుత్వం స్పందించే తీరును బట్టే తమ జోక్యం ఆధారపడి ఉంటుందని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్న తర్వాత.. రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని వెల్లడించనున్నట్టు తెలిపింది సుప్రీంకోర్టు.