ఏపీ కమలంలో కల్లోలం… నలుగురిపై వేటు…!

కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. కమిటీలో జరుగుతున్న మార్పులు కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నమొన్నటి వరకూ ఏపీ బీజేపీని నడిపిన ఆ నలుగురిలో.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. మరో ఇద్దరిని రేపో, మాపో సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీ బీజేపీ నాయకత్వం మార్పుతో ఆ పార్టీలోనే కాకుండా , అధికార పార్టీకి సైతం సెగ తగులుతోంది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీలో తమ వారు నేతలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడాలంటే తెలుగుదేశంపై విమర్శలు చేసి.. ఆ తరువాత వైసీపీపై పొలిటికల్ అటాక్ చేస్తున్న బీజేపీ నేతల వ్యవహారం కేంద్ర పెద్దల వరకూ వెళ్లింది. కుప్పలు, తెప్పలుగా వస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. వైసీపీ నేతలు కొంతమంది ఢిల్లీలో చేసిన లాబీయింగ్‌తో వారిని కొనసాగించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలోనే.. 2024 ఎన్నికలకు వెళతామని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ శివప్రకాష్‌ చెప్పడం.. ఆ వెనువెంటనే ఈ అంశాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జ్‌ సునీల్ దియోధర్ సమావేశం బయట అందరికీ చెప్పేశారు. ఈ ప్రకటనతో బీజేపీలో చిచ్చు రాజుకుంది. దీనిపై కొందరు ఏపీ బీజేపీ నేతలు.. హైకమాండ్‌కు రాష్ట్ర నాయకత్వం తీరుపై ఫిర్యాదు చేశారు.

అటు.. రాజధాని అమరావతి విషయంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పటికీ.. అమరావతే ఏపీ రాజధాని అని ఏకగ్రీవ తీర్మాణం చేసిన బీజేపీ మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. ఈ అంశంపై తిరుపతిలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి క్లాస్ పీకారు. దీంతో.. అమరావతి రైతుల ఉద్యమంలో కమలనాథులు పాల్గొన్నారు. ఆ తరువాత మాత్రం అటువైపు కన్నెత్తిచూడలేదు. పైగా.. అమరావతి మహిళల వస్త్రధారణపై బీజేపీ నేతలు చేసిన కామెంట్స్‌ కూడా రాజధాని రైతుల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. రాష్ట్ర నాయకత్వం మరికొన్ని అంశాలపై కూడా సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయిందనే నివేదికలు, ఆరోపణలు కేంద్రం వద్దకు వెళ్లాయి.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును బీజేపీ కేంద్ర పెద్దలు ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా ఇరువురూ కూడా చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తరువాత కొద్దిరోజులకు బీజేపీలో సంస్థాగత మార్పులు ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఈ మార్పుల్లో భాగంగా ఏపీలో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి.. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు. ఈ నియామకం తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చకపోయినప్పటికీ కూడా తాజాగా పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా.. బీజేపీ జాతీయ కమిటీలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సునీల్ దియోధర్‌ను రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్‌గా తొలగించారు. ఆ నలుగురిలో ఇద్దరి పదవులు ఊడిపోవడంతో.. మరొకరి పదవి రాబోయే రోజుల్లో రాష్ట్ర కార్యవర్గంలో తొలగిస్తారని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నేత పదవికి సంబంధించి కేంద్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన తొలగింపు ఖాయమని తేలిపోయింది.

రాజధాని అమరావతి, మైనింగ్, ఇసుక మాఫియా, కేంద్ర నిధులను ప్రభుత్వం మళ్లిస్తున్న వైనంపై పురంధేశ్వరి విరుచుకుపడుతున్నారు. జోనల్ సమావేశాల్లో కూడా ఆమె పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గతంలో చీటికి మాటికి రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా, అంతా తన పెత్తనమేనన్న స్థాయిలో వ్యవహరించిన మరో కీలక నేతకు కూడా పదవి ఉన్నప్పటికీ, ఇక ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ త్వరలోనే ఆయనకు తెగేసి చెబుతోందని సమాచారం. ఈ మేరకు ఏపీ బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన వెంటనే బీజేపీ అగ్ర నేతలు కూడా రాష్ట్ర పర్యటనకు వచ్చి ఏపీలో ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్న పలు సమస్యలపై స్పష్టమైన హామీలు ఇస్తారని కూడా ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై హామీలు ఇవ్వకపోతే.. పొత్తుల విషయంలో కష్టమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలకు స్పష్టం చేశారు. ఇందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకొని మాత్రమే రాష్ట్రానికి రావాలని ఆయన బీజేపీ హైకమాండ్‌కు సూచించినట్టు తెలుస్తోంది.

తొలుత ఇంటిని చక్కదిద్ది.. ఆ తరువాత ఏపీ ప్రజల ముందుకు వద్దామని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో అధికార పార్టీతో అంటకాగుతున్న నేతలకు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు.