కేసీఆర్..జగన్‌ని హైలైట్ చేసింది అందుకేనా?

రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేసి సత్తా చాటగల నాయకుల్లో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడేసి ప్రజలని ఆకర్షించగలరు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజలని ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడి..ప్రతిపక్షాలపై విరుచుకుపడి..ఈ 9 ఏళ్లలో తాము తెలంగాణని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.

అన్నీ అంశాలని ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినడంపై ఆయన కామెంట్ చేశారు. అక్కడ జగన్‌ని రాంగ్‌గా హ్యాండిల్ చేసి కాంగ్రెస్ దెబ్బతిందని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసిందని, దీనితో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకున్నారని, రికార్డుస్థాయి మెజారిటీతో విజయం సాధించారని, కడప లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో అయిదు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారని అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో స్వీప్ చేశారని, దీనితో ఆంధ్రాలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పుకొచ్చారు.

అయితే ఏపీలో కాంగ్రెస్, జగన్ మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదే ఎప్పుడో అయిపోయిన రాజకీయం. ఇప్పుడు కే‌సి‌ఆర్ ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు. జగన్‌ని ఎందుకు పొగిడారు అంటే..దానికి వెనుక రాజకీయం కోణం లేకుండా ఉండదు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. అలాగే వైఎస్సార్ అభిమానులు ఉన్నారు.

ఇటు జి‌హెచ్‌ఎం‌సి, ఖమ్మంలో ఏపీ నుంచి సెటిల్ అయిన వారు ఎక్కువే. అందులో వైసీపీని అభిమానించే వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఓట్లని బి‌ఆర్‌ఎస్‌కు పడేలా చేసుకోవడానికి కే‌సి‌ఆర్..జగన్ పేరుని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ఎలాంటి మ్యాజిక్ అయిన చేయగలరు.