టీడీపీలో భయపడుతున్న నేతలు… కారణం అదేనా….!

తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా కేంద్ర కార్యాలయం నుంచే ఆదేశిస్తున్నారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గం స్థాయి నేతలను భయపెడుతోంది. ఇంకా చెప్పాలంటే… కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. అదే సమయంలో ఎన్నికలు బాగా కాస్ట్రీ గురూ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది రూ.2 వేలు దాటే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన కొన్ని చోట్ల కేవలం పంపకాలకే దాదాపు రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అని నేతలు తమ సన్నిహితులకు చెప్పేశారు కూడా. ఇక వీటికి తోడు ప్రచారం, సభలు, పార్టీ ఆఫీసులు, ద్వితీయ శ్రేణి నేతల హంగామా, ర్యాలీలు… ఇలా మరో రూ.30 కోట్ల వరకు ఖర్చు తప్పని పరిస్థితి. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేయాలంటే… కనీసం రూ.80 నుంచి రూ.వంద కోట్ల వరకు అవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓ పది పెరుగుతుంది తప్ప.. తగ్గే పరిస్థితి లేదనేది నేతల మాట.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు సంపాదించుకున్నది ఏమీ లేదనేది వాస్తవం. ప్రజలకు నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేయడం, సంక్షేమ పథకాలను వాలంటీర్ ద్వారా నేరుగా లబ్దిదారు ఇంటికే అందించడం జరుగుతోంది. ఇక మద్యం వ్యాపారం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. బెల్ట్ షాపులు లేకపోవడంతో… డబ్బులు రావడం లేదు. దీనికి తోడు టీడీపీ నేతల వ్యాపారాలపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసిందనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే ఖజానా ఖాళీ అని నేతలంతా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ తిరగాల్సి వస్తోంది. వీటికి తోడు అధినేత వరుస పర్యటనలకు, లోకేశ్ పాదయాత్రకు జన సమీకరణ, వసతి, భోజన ఏర్పాట్లు… వీటన్నిటికీ ఇప్పుడు ఖర్చు చేస్తే… రాబోయే రోజుల్లో డబ్బులకు ఇబ్బందులు తప్పవంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పైగా ఇప్పుడు ఖర్చు చేసినా… ఎన్నికల నాటికి టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధినేత నుంచి ఫోన్ అంటే చాలు… హడలిపోతున్నారు.