ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు.

ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీకి కలిసిరానుంది. అయితే ఆల్రెడీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులని..ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బాటలోనే కే‌సి‌ఆర్ కూడా వచ్చారు. ఇక ఇటీవల తెలంగాణని వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ సర్కార్ తక్షణ వరద సాయం ప్రకటించింది. రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అటు హైదరాబాద్‌ మెట్రోరైలును మరో 415 కిలోమీటర్లకు విస్తరించాలని కే‌సి‌ఆర్ సర్కార్ తీర్మానించింది.

అదే విధంగా అనాథ పిల్లల సంరక్షణకు ఆర్ఫన్‌ పాలసీ రూపొందించనున్నారు. అటు వరంగల్‌ విమానాశ్రయానికి 253 ఎకరాలు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టులో 2వ విమానాశ్రయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరో ఎనిమిది వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపింది.

అలాగే రాజకీయంగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాలని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. మొత్తం మీద ప్రజా ఆకర్ష నిర్ణయాలని కే‌సి‌ఆర్ ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఎన్నికల్లో మరింత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు.