క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోయ‌ద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మ‌క్కీకి మ‌క్కీ దించకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ మ‌రియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకోగా.. త్రివిక‌మ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు.

జూలై 28న ఎన్నో అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ్రో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యానియాతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ అవ్వ‌డానికి త‌క్కువ ఛాన్సులే ఉన్నా.. మిక్స్డ్ టాక్ తో బ్రో గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతోంది. ఇక‌పోతే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ. 97.50 కోట్ల రేంజ్ లో జ‌రిగింది. అయితే తాజాగా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

బ్రో సినిమా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ క‌ళ్లు చెదిరే స్థాయిలో జ‌రిగింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ అన్నీ కలిపి ఏకంగా రూ. 50 కోట్ల రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ను బ్రో మూవీ సొంతం చేసుకుందని అంటున్నారు. అందులో రూ. 30 కోట్లు డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. అన్న‌ట్లు బ్రో సినిమా రెండు ఓటీటీల్లో సంద‌డి చేయ‌బోతోంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న జీటీవీకి బ్రో డిజిట‌ల్ రైట్స్ వెళ్లాయి. ఇక వ‌చ్చే నెల 2వ తేదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే. ఆయ‌న బ‌ర్త్‌డే గిఫ్ట్ గా సెప్టెంబ‌ర్ 1న బ్రో సినిమా అటు నెట్ ప్లిక్స్, ఇటు జీ5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతోంద‌ని స‌మాచారం.