సిక్కోలు ఫ్యాన్‌ పోరు..సైకిల్‌కి ప్లస్ చేస్తారా?

ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టి‌డి‌పి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టి‌డి‌పికి ప్లస్ అయ్యేలా ఉంది.

ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తుంది. అటు పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా కొందరు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేస్తున్నారు. అలాగే ఇచ్ఛాపురంలో గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు అన్నట్లు ఉంది. అక్కడ ఎమ్మెల్సీ రామారావు వర్గానికీ, సాయిరాజ్‌ వర్గానికి మధ్య పొసగడంలేదు. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు స్థానిక నేతలతో పడడం లేదు. అటు ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

అలాగే స్పీకర్‌ తమ్మినేని, మంత్రి ధర్మాన మధ్య విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇలా సిక్కోలులో ఎక్కడకక్కడ వైసీపీ నేతల మధ్య వర్గ పోరు ఉంది. ఈ జిల్లాలోనే కాదు..దాదాపు అన్నీ జిల్లాల్లో ఇదే పరిస్తితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సిక్కోలులో టి‌డి‌పి బలపడింది. ఈ నేపథ్యంలో వైసీపీలో అంతర్గత పోరు టి‌డి‌పికి బాగా కలిసిరావచ్చు.

గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ ఆధిక్యం సాధించింది. 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ప్రస్తుతం టి‌డి‌పి 5, వైసీపీ 2…మిగిలిన మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తుంది.