కమలం మళ్ళీ రేసులోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్.!

తెలంగాణలో గత కొంతకాలం నుంచి బి‌జే‌పి సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కీలక మార్పులు..అధ్యక్షుడుని మార్చడంతో కొంత అనిశ్చితి పరిస్తితులు నెలకొన్నాయి. అలాగే అనూహ్యంగా ఆ పార్టీ రేసులో వెనుకబడింది. ఇటు కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే అంతకముందు బి‌జే‌పి పైకి లేవడానికి కే‌సి‌ఆర్ చేసిన రాజకీయమే కారణమని, అలా బి‌జే‌పిని పైకి లేపితే కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలుస్తుందని దాని ద్వారా బి‌ఆర్‌ఎస్ కు లాభమని విశ్లేషణలు వచ్చాయి.

అయితే ఇప్పుడు బి‌జే‌పి గ్రాఫ్ పడిపోయింది..దీంతో కాంగ్రెస్..బి‌ఆర్‌ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా ముందుకొచ్చింది. ఈ క్రమంలో మళ్ళీ బి‌జే‌పిని పైకి లేపడానికి కే‌సిఆర్ ప్లాన్ చేశారని, అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్ళిన బి‌జే‌పి నేతలని అరెస్ట్ చేయించి..వాళ్ళని హైలైట్ చేసేలా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందనేది పరిశీలించడానికి బి‌జే‌పి నేతలు రంగారెడ్డి జిల్లాల్లోని బాటసింగారం వెళ్ళేందుకు ప్లాన్ చేశారు.

కానీ అక్కడకు వెళ్లకుండా ఈటల రాజేందర్, డి‌కే అరుణ ఇతర బి‌జే‌పి నేతలని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు బి‌జే‌పి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రఘునందన్ రావు లని అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని బి‌జే‌పి కార్యలయం వద్ద వదిలేశారు.

అయితే ఇదంతా కే‌సి‌ఆర్ ఆడిస్తున్న డ్రామా అని, గతంలో ఇళ్ల పరిశీలనకు తాము వెళ్లామని అప్పుడు ఎవరు అడ్డుకోలేదని, ఇప్పుడు బి‌జే‌పి నేతలని అడ్డుకోవడం..ఇదొక రాజకీయం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బి‌జే‌పిని హైలైట్ చేసి మళ్ళీ రేసులోకి తీసుకొచ్చి..కాంగ్రెస్ ని దెబ్బతీయడమే కే‌సి‌ఆర్ కుట్ర అని అంటున్నారు.