నెల్లూరులో జగన్ రివర్స్ ఆపరేషన్..వైసీపీలోకి కీలక నేత.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి పలువురు కీలక నేతలు రావడం…అటు నారా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టి‌డి‌పి వైపుకు వచ్చారు. దీంతో నెల్లూరులో టి‌డి‌పికి బలం పెరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ సైతం రివర్స్ ఆపరేషన్ చేస్తుంది. నెల్లూరులో ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతుంది.

ఈ క్రమంలోనే టి‌డి‌పిలోని కీలక నేతలని వైసీపీలోకి తీసుకొస్తున్నారు. ఇటీవలే బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చారు. తాజాగా ఆనం జయకుమార్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారు. అయితే మొన్నటివరకు ఆనం జయకుమార్ టి‌డి‌పిలో పనిచేశారు. 2014 ఎన్నికల  తర్వాత టి‌డి‌పిలో చేరి..ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీలో ఉన్నారు.

కానీ ఇటీవల ఆనం రామ్ నారాయణ రెడ్డి టి‌డి‌పిలోకి వచ్చారు. దీంతో ఆనం జయ కుమార్ రెడ్డిని టి‌డి‌పి నుంచి వైసీపీలోకి తీసుకున్నారు. ఇలా టి‌డి‌పికి వైసీపీ కౌంటర్ ఇస్తూ ముందుకెళుతుంది. అయితే నెల్లూరు రూరల్ బాధ్యతలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎంపీ సీటుని ఆనం జయకుమార్‌కు ఇస్తారని టాక్ నడుస్తుంది.

అయితే ప్రస్తుతం నెల్లూరులో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. మొన్నటివరకు వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండేది..కానీ దాన్ని టి‌డి‌పి తగ్గించి రేసులోకి వచ్చింది. రెండు పార్టీల మధ్య పోటాపోటి ఉంది. చూడాలి ఈ సారి నెల్లూరులో పై చేయి ఎవరిదో.