ముందస్తుకే జగన్ మొగ్గు..మోదీకి ఏం చెప్పారు?

ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? జగన్ ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారా? ప్రతిపక్షాలు చెబుతున్నట్లు జగన్ ఢిల్లీకి వెళ్లింది..మోదీతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా పర్మిషన్ తెచ్చుకోవడానికేనా? అంటే తాజాగా వస్తున్న కథనాలని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒకటి నిధుల కొరత..సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్తితి..పథకాలకు డబ్బులు కూడా అందడం లేదు.

ఇటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా ఎక్కువ టైమ్ ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లిపోతేనే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అందుకే పదే పదే ఆయన ఢిల్లీ టూర్‌కు వెళ్ళి..కేంద్ర పెద్దలని నిధులు అడగడంతో పాటు, ముందస్తుకు వెళ్ళేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. తాజాగా జగన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. మొదట అమిత్ షాతో భేటీ అయిన జగన్…తర్వాత మోదీతో భేటీ అయ్యారు. నవంబరు లేదా డిసెంబరులో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిపించాలని జగన్‌ ప్రధాని మోదీని, అమిత్‌షాను కోరినట్లు తెలిసింది. వీరిద్దరితో జగన్‌ భేటీ ముగియగానే… జగన్ అనుకూల నేషనల్ మీడియా.. ఏపీ ఎన్నికలను ముందుకు జరిపి, ఈ ఏడాదిలోనే నిర్వహించడంపై చర్చ జరిగినట్లు తెలిసిందని కథనాలు ఇచ్చింది.

ఇక ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమని వార్తలు వేసింది. అయితే ఆ ఐదు రాష్ట్రాలతో పాటు ఏపీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? అది జరిగే పనేనా అంటే ఏమో చెప్పలేం..కేంద్ర పెద్దలు ఎలాగో జగన్‌కు అనుకూలంగానే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు జగన్ కోసం ఏపీలో ముందస్తు ఎన్నికలకు సహకరించే అవకాశం ఉంది. చూడాలి మరి ముందస్తు ఉంటుందో లేదో.