బాబు-పవన్ మరోసారి భేటీ..ఇంకా సెట్ అయినట్లేనా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఇటీవల ఎన్డీయే సమావేశానికి వెళ్లొచ్చిన పవన్..పొత్తులపై కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. ఇటు టి‌డి‌పి శ్రేణులు ఏమో పొత్తు వద్దు ఒంటరిగానే బరిలో ఉందామని అంటున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి బాబు-పవన్ భేటీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ ఇద్దరు మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. కానీ అప్పుడు పొత్తుల గురించి మాట్లాడలేదని, వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు పొత్తులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. జనసేన-బి‌జే‌పిలతో టి‌డి‌పి కలుస్తుందా? లేక ఒంటరిగానే బరిలో ఉంటుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే జనసేనతో పొత్తుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ బి‌జే‌పితో పొత్తు వల్ల నష్టపోతామని టి‌డి‌పి శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పికి బలం ఒక శాతం కూడా లేదని, పైగా రాష్ట్రానికి న్యాయం చేయలేదని, అలాంటప్పుడు బి‌జే‌పితో కలిస్తే.. ఆ వ్యతిరేకత టి‌డి‌పికి వస్తుందని దీని వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. పైగా వైసీపీకి లాభం జరుగుతుందని చెబుతున్నారు.

ఇక మూడు పార్టీలు పొత్తు ఉంటే..ప్రధానంగా టి‌డి‌పికి అన్నీ చోట్ల బలం ఉంది..ఇక బి‌జే‌పి-జనసేనలకు కొన్ని సీట్లు కేటాయించాలి. అప్పుడు ఆ సీట్లలో టి‌డి‌పి ఓట్లు..ఆ పార్టీలకు పూర్తి బదిలీ అయ్యే అవకాశాలు ఉండవు. దీని వల్ల కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి పొత్తులపై ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.