ఫ్లెక్సీ వార్: వైసీపీకి టీడీపీ-జనసేన కౌంటర్..కానీ!

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యలో జనసేన సైతం వైసీపీపై ఫైర్ అవుతుంది. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతి నియోజకవర్గంలో కడుతున్న ఓ ఫ్లెక్సీ అంశం బాగా వివాదమవుతుంది. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పేదలని కాపాడుతున్నట్లు ఫోటో పెట్టడం…వారిపై చంద్రబాబు, పవన్ లాంటి వారు రాళ్ళు విసురుతున్నట్లు చూపించడం.

ఇలా ఎక్కడకక్కడ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ ఫ్లెక్సీలు తమ నేతలని కించపరిచేలా ఫోటోలు వేయడంపై టి‌డి‌పి, జనసేన నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ పోలీసులు ఆ ఫిర్యాదులని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో టి‌డి‌పి, జనసేనలు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే వాటిని మాత్రం పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో టి‌డి‌పి, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

అధికార పార్టీకో న్యాయం..తమకో న్యాయమా? అని ఫైర్ అవుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇదే రచ్చ ఉంటుంది. దీంతో రాజకీయం మరింత రంజుగా మారింది. ముఖ్యంగా వైసీపీ..జనసేనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ టార్గెట్ చేస్తుంది . అక్కడ ఏ జనసేన ఫ్లెక్సీ పెట్టిన తీసేలా చేస్తున్నారు. జనసేన ఫ్లెక్సీలు విధ్వంసంపై ఎక్కడి కక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఎక్కడకక్కడ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ ఫ్లెక్సీలకు టి‌డి‌పి, జనసేన ఫ్లెక్సీలు కట్టాయి. కానీ పోలీసులు టి‌డి‌పి, జనసేన ఫ్లెక్సీలు తీసేశారు. వైసీపీ ఫ్లెక్సీలు తీయలేదు.