అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?

ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇక తాజాగా హీరోల లిస్ట్ పెంచారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ పేర్లు చెప్పి వారంతా తనకు ఇష్టమే అని, వారి అభిమానులు సినిమాల పరంగా ఇష్టపడిన రాజకీయాల పరంగా వచ్చేసరికి రాష్ట్రం కోసం నిలబడాలని, తనకు అండగా నిలబడాలని అన్నట్లు కోరుతున్నారు. ఇలా పదే పదే హీరోల పేర్లు చెప్పి..వారి అభిమానులని పవన్ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ప్రభాస్, మహేష్ పాన్ ఇండియా రేంజ్ అని, తన కంటే పెద్ద హీరోలని, ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్థాయికి ఎదిగారని వారు ప్రపంచమంతా తెలుసని, కానీ తాను అంతగా తెలియదని, అయినా తనకు ఇగో లేదని, అందరూ హీరోలు ఇష్టమే అని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ ఓట్లు జనసేన వైపుకు రావడమే పవన్ టార్గెట్ గా ఉంది.

పవన్ చెప్పిన హీరోలకు రాష్ట్రంలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో అభిమానులు ఉన్నారు. వారంతా వన్ సైడ్ గా ఉంటే పవన్‌కు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కానీ వారు కూడా పార్టీలుగా విడిపోయి ఉన్నారు. కాబట్టి పవన్ ఆశించిన మేర ఇతర హీరోల ఫ్యాన్స్ మద్ధతు లభించకపోవచ్చు.