కాంగ్రెస్‌కు బిగ్ టర్నింగ్ పాయింట్..ఈటల-కోమటిరెడ్డి రెడీ అయ్యారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది.  ఇంతకాలం రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్..ఒక్కసారి రేసులోకి దూసుకొచ్చి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పోటీగా నిలబడుతుంది. ఇక ఊహించని విధంగా ఆ పార్టీలో చేరికలు సంచలనం సృష్టించనున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక అసలైన చేరికలు జులై 2 లేదా 3వ తేదీల్లో ఉండనున్నాయి. అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. పలువురు కీలక నేతలు ఈ భేటీలో పాల్గొనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌, హర్కార వేణుగోపాల్‌ తదితరులు పాల్గొననున్నారు. తాను ఖమ్మంలో నిర్వహించనున్న సభలో కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనతోపాటు ముఖ్యమైన నేతలు, తన అనుచరులంతా చేరతారని చెప్పుకొచ్చారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జులై 2 లేదా 3న ముగిసే అవకాశాలు ఉన్నాయి.

అప్పుడు రాహుల్ సమక్షంలో ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. ఈ సభలో చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తెస్తాయని చెప్పవచ్చు. మొన్నటివరకు కాంగ్రెస్ నుంచి పలువురు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల్లోకి వెళ్ళిపోయారు.

ఇప్పుడు రివర్స్ లోకి కాంగ్రెస్ లోకి నేతలు వస్తున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి మాత్రమే కాదు..బి‌జే‌పిలో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్ లోకి వచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.