లోకేష్‌తో సీన్ చేంజ్..మంత్రికి సెగలు..ఎదురుగాలి.!

పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే..మొదట్లో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు అనుకున్న మేర రాలేదు గాని..నిదానంగా పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. ఊహించని విధంగా ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది.

ఆలూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా ప్రజలు వచ్చారు. అంటే అక్కడ టి‌డి‌పి బలం ఏ మేర పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచినా జయరాం మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయ్యాక..ఆయన ఫ్యామిలీ తప్ప, ఆలూరు ప్రజలు బాగుపడలేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా లోకేష్ సైతం ఆలూరుకు వచ్చి అదే తరహాలో జయరాంపై విరుచుకుపడ్డారు.

జయరాం వాల్మీకి కులానికి చెందిన నాయకుడు అని, కానీ ఆ కులానికి జయరాం చేసింది ఏమి లేదని, ఆయన ఫ్యామిలీ మాత్రమే ఆస్తులు కూడబెట్టుకుందని లోకేష్ ఫైర్ అయ్యారు. అక్రమ ఇసుక, పేకాట క్లబ్బులు నిర్వహించడం, భూ కబ్జాలు చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై జయరాం స్పందిస్తూ..అవన్నీ ఆధారాలతో సహ నిరూపించాలని సవాల్ చేశారు.

ఈ క్రమంలోనే ఆలూరు టి‌డి‌పి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. లోకేష్ విసిరిన సవాల్‌కి మంత్రి జయరామ్ వింత సమాధానం చెబుతున్నారని, జయరామ్‌కు టీడీపీ జడ్పీటీసీ భిక్ష పెట్టిందని, కానీ ఆయన వేరే పార్టీలోకి వెళ్లి పీకేందేంటని ప్రశ్నించారు. జయరాంకి లోకేష్ బాబు కాదు.. తాను సవాల్ చేస్తున్నానని,  ఐటీ ఇచ్చిన నోటీసులకు జయరామ్ సమాధానం చెప్పాలని, మంత్రి జయరాం కర్ణాటక మద్యం, పేకాట స్థావరాలు, ఇసుక లూటీ ,బియ్యం మాఫియా ప్రజాలకంతా తెలుసని, బాధిత రైతులకు తాము అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. అసలుకే వ్యతిరేకత ఎదురుకుంటున్న జయరాంకు..లోకేష్ పాదయాత్రతో మరింత ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.