కృష్ణాలో బాబు టూర్..మూడు చోట్ల తమ్ముళ్ళ రచ్చ..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక దీని ద్వారా జిల్లాలో టి‌డి‌పికి కాస్త ఊపు తీసుకొస్తారని చెప్పవచ్చు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటన ఉంది.

ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటనతో కార్యకర్తల్లో జోస్ నెలకొంది. చాలా రోజుల తర్వాత బాబు ఈ మూడు చోట్ల పర్యటిస్తున్నారు. ఇక స్వచ్ఛందంగా బాబు సభకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని అంతర్గత తగాదాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. మూడు చోట్ల అదే రచ్చ ఉంది. నూజివీడులో గ్రూపు తగాదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బాబు..నూజివీడు నేతలకు క్లాస్ తీసుకున్నారు. అయినా సరే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు.

ఇటు గుడివాడలో బాబు పర్యటనని విజయవంతం చేయాలని నేతలు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. నలుగురైదుగురు నేతలు సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే అంతా బాగానే ఉందనుకున్న మచిలీపట్నంలో కూడా రచ్చ నడుస్తోంది. అక్కడ టి‌డి‌పి కార్పొరేటర్ కొట్టే వెంకటరావు..ఇంచార్జ్ కొల్లు రవీంద్రపై ఆగ్రహంతో ఉన్నారు.

కాపు నేతలని పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి బాబు పర్యటనతో ఈ మూడు చోట్ల రచ్చ తగ్గుతుందేమో చూడాలి.