యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..

సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం.

• కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు

జబర్దస్త్‌ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్‌ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా కామెడీ మూవీ తీస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన మాత్రం ఎవరూ ఊహించని ఎమోషనల్‌ డ్రామా సినిమా “బలగం” తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది. ఈ చిత్రాన్ని చూస్తూ భావోద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్నామని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెప్పడం, వేణు ప్రతిభకు నిదర్శనం. ఓ ఇంటి పెద్ద మరణం చుట్టూ సాగే ఈ కథలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, రూపా లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

• అవసరాల శ్రీనివాస్

నటుడిగా కెరీర్‌ ప్రారంభించి, దర్శకుడిగా మారిన వారిలో అవసరాల శ్రీనివాస్‌ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘ఆరెంజ్‌’, ‘పిల్ల జమీందార్‌’ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన తొలిసారి ‘ఊహలు గుసగుసలాడే’ కోసం మెగాఫోన్‌ పట్టారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఓ వైపు యాక్టింగ్‌ చేస్తూనే మరోవైపు డైరెక్టర్‌గా, రైటర్‌గా పనిచేశారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ . ఈ సినిమా మార్చి 17న రిలీజ్‌ అయింది. యావరేజ్ టాక్ సంపాదించుకుంది.

 

• విశ్వక్ సేన్

‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది?’లాంటి రెండు చిత్రాలతో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ మూడో సినిమాకే దర్శకుడు అయ్యాడు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన ఫస్ట్‌ మూవీ ‘ఫలక్‌నుమా దాస్‌’ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా..!’ లాంటి సినిమాల్లో హీరో గా సందడి చేసిన విశ్వక్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ కోసం మరోసారి దర్శకత్వ బాధ్యత తీసుకున్నారు. యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది.విశ్వక్ సేన్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

• రిషబ్ శెట్టి

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక- నటుడు రిషబ్‌ శెట్టి. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 400 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా లో రిషబ్‌ నటన అత్యద్భుతం. ఇటీవల ఆ చిత్రానికి ప్రీక్వెల్‌ ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ‘తుగ్లక్‌’, ‘లూసియా’తదితర కన్నడ చిత్రాల్లో నటుడిగా కనిపించిన రిషబ్‌ ‘రిక్కీ’ సినిమాతో తనలోని దర్శకుణ్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు కానీ అందులో ఆయన నటించలేదు.