`ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ కు 80 కోట్లు అన్నారు.. అస‌లు బ‌డ్జెట్ తెలిస్తే షాకే!

భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఆర్ఆర్‌ఆర్ మూవీతో సహకారం ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఒక ఇండియన్ సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుండి పోయే ఘ‌న‌త ఇది. అయితే ఆస్కార్ అవార్డును కైవ‌శం చేసుకునేందుకు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ అమెరికాలో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ చేశారు.

ఇందుకోసం రాజ‌మౌళి దాదాపు రూ. 80 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కొంద‌రైతే 80 కోట్లు పెట్టి రాజ‌మౌళి ఆస్కార్ ను కొన్నార‌ని కూడా విమ‌ర్శించారు. అయితే ఈ విమ‌ర్శ‌ల‌కు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` లైన్‌ ప్రొడ్యూసర్ గా వ్యవ‌హ‌రించిన‌ కార్తికేయ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ అస‌లైన బ‌డ్జెట్ ను రివీల్ చేశాడు.

`ఆస్కార్‌ కొనడమనేది పెద్ద జోక్‌.. 95ఏళ్ల చరిత్ర కలిగిన ఇనిస్టిట్యూట్‌ అది. అక్కడ ప్రతీది ఓ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. అయినా ఆడియెన్స్ ప్రేమని కొనగలమా ? స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్‌ల మాటలను కొనగలమా, కొనలేం కదా` అని కౌంటరిచ్చారు. ఇక ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్ గురించి కూడా కార్తికేయ స్పందించాడు. `హాలీవుడ్‌ సినిమాలు ఇలాంటి ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఛాన్స్ లేదు.

ప్ర‌మోష‌న్స్ కోసం మేము అనుకున్న బడ్జెట్ రూ.5 కోట్లు. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనకున్నాం. మొదటి దశలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టాం. నామినేషన్స్‌కు వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తం రూ.8.5 కోట్లు అయింది.` అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ అస‌లు బ‌డ్జెట్ తెలిసి షాక్ అవ్వ‌డం నెటిజ‌న్ల వంతు అయింది.