ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటింగ్ విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే టిడిపికి క్రాస్ ఓటు చేశారని వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నలుగురుని చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.
ఆరోపణలు చేశారు గాని అందులో నిజాలు ఎంత వరకు ఉన్నాయనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఎక్కడైనా అధికార పార్టీలో ఉంటేనే ఏదైనా చేయవచ్చు..అలాగే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఇప్పుడు అన్నీ కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్సీ కోసం రిస్క్ చేయడం అనేది కష్టమే. కాబట్టి డబ్బుల ఆఫర్ లో లాజిక్ లేదు..అయితే ఆ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి ఉండటం..అలాగే కొందరికి సీటు దక్కదనే డౌట్ ఉండటం…చంద్రబాబు ఏదొక విధంగా సీటు ఇస్తామనే హామీ ఇస్తే .. ఆ రెబల్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసి ఉంటారనేది విశ్లేషకుల వాదన.
కాకపోతే చంద్రబాబు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలని కొన్నారనే ప్రచారాన్ని వైసీపీ ఎక్కువ చేస్తుంది. దాని వల్ల జనంలో చంద్రబాబు నెగిటివ్ అవుతారనేది వైసీపీ కాన్సెప్ట్. ఇదే క్రమంలో రాపాక వరప్రసాద్ సైతం బయటకొచ్చి తనకు పదికోట్ల ఆఫర్ ఇచ్చారని, టిడిపికి క్రాస్ ఓటు చేయాలని అడిగారని ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు తనతో మాట్లాడారని చెప్పారు.
కానీ అవన్నీ అవాస్తవాలు అని, అసలు రాపాకతో తాను మాట్లాడలేదని రామరాజు చెప్పుకొచ్చారు. అసలు తమకు 23 మంది బలం ఉంది..23 ఓట్లు వచ్చాయని..అలాంటప్పుడు రాపాకతో పని ఏంటి అంటున్నారు. అయితే జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన రాపాక..ఇప్పుడు టిడిపి ఆఫర్ చేసిందని చెప్పడం సజ్జల స్క్రిప్ట్ అని ప్రచారం వస్తుంది. మొత్తానికి ఈ స్క్రిప్ట్ లతో వైసీపీకి ఒక్క ఓటు అదనంగా రాదని అంటున్నారు.