సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..

టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, ‘మాస్ మహారాజా’ రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటించింది. ఈ రెండు సినిమాలను కూడా మైత్రీ మూవీస్ వారు నిర్మించారు.

గతంలో పలుమార్లు సంక్రాంతికి చిరంజీవి-బాలకృష్ణ సినిమాలు విడుదల అయ్యాయి. ఆ సమయంలో ఈ అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కోసం పోటీ పడ్డాయి. అవేంటో తెలుసుకుందాం. 1985లో తొలిసారి సంక్రాంతికి ఒకేసారి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదల అయ్యాయి. చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, బాలకృష్ణ నటించిన ఆత్మబలం సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. తర్వాత 1987లో చిరంజీవి నటించిన దొంగమొగుడు, బాలకృష్ణ నటించిన భార్గవరాముడు సినిమాలో విడుదల అయ్యాయి. 1988లో కూడా చిరంజీవి నటించిన మంచిదొంగ, బాలకృష్ణ నటించిన ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. 1997 సంక్రాంతి సీజన్‌లోనూ చిరంజీవి నటించిన హిట్లర్, బాలకృష్ణ పెద్ద అన్నయ్య సినిమాలు విడుదలై మంచి హిట్ టాక్ అందుకున్నాయి. 1999లో చిరు ‘స్నేహం కోసం’, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమర సింహారెడ్డి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

2000వ సంవత్సరంలో చిరు హీరోగా వచ్చిన అన్నయ్య, బాలయ్య హీరోగా వచ్చిన వంశోద్ధారకుడు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. 2001లో అయితే జనవరి 11న ఒకే తేదీలో చిరు నటించిన మృగరాజు, బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2004లో చిరంజీవి నటించిన అంజి, బాలయ్య నటించిన లక్ష్మీనరసింహా విడుదలయ్యాయి. 2017లో చిరు నటించిన ఖైదీ నంబర్ 150, బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మరోసారి 2023 జనవరిలో ఈ అగ్రహీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపారు.