సీమ సిటీల్లో వైసీపీకి రిస్క్..?

రాయలసీమ పేరు చెబితే..మరో ఆలోచన లేకుండా వైసీపీ అడ్డా అని గుర్తొచ్చేస్తుంది. సీమ ప్రజలు వైసీపీని ఆదరిస్తూనే వస్తున్నారు. 2012 ఉపఎన్నికల దగ్గర నుంచి..ఈ మధ్య జరిగిన బద్వేల్ ఉపఎన్నిక వరకు సీమ ప్రజలు వన్ సైడ్‌గా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి అన్నీ సీట్లు అప్పజెప్పే స్థాయిలో సీమ ప్రజలు ఓట్లు వేశారు. జిల్లాలో 52 సీట్లు ఉంటే..49 వైసీపీని గెలిపించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు. వన్ సైడ్‌గా వైసీపీని గెలిపించేశారు. ఇలా పూర్తిగా వైసీపీకి అండగా ఉన్న సీమ ప్రజల్లో ఇప్పుడుప్పుడే కాస్త మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీని వన్‌సైడ్‌గా గెలిపించిన అనుకున్న స్థాయిలో సీమలో అభివృద్ధి జరగకపోవడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ఇంకా పలు అంశాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. అయితే ఎంత మైనస్ ఉన్నా సరే మెజారిటీ ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారు.

కాకపోతే కొన్ని స్థానాల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పరిస్తితులు మారుతున్నాయి. వాస్తవానికి అన్నీ కార్పొరేషన్లు వైసీపీనే గెలుచుకుంది. కానీ అది అధికార బలమే. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలోచ్చేసరికి నగరాల్లోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ టఫ్ ఫైట్ ఎదురుకునేలా ఉంది.

చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు సిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి రిస్క్ ఎక్కువ కనిపిస్తోంది. కడప టౌన్‌లో ఎలాగో వైసీపీకి తిరుగులేదు. అది పక్కన పెడితే…తిరుపతి, అనంతపురం, కర్నూలు సిటీల్లో టీడీపీ బలం పెరుగుతుంది. ఇక బలమైన అభ్యర్ధి బరిలో ఉంటే చిత్తూరులో కూడా సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ సిటీల్లో జనసేన ప్రభావం కూడా కాస్త ఉంది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే..సీమ సిటిల్లో వైసీపీకి ఇబ్బంది అవుతుంది.