నగరి గ్రౌండ్ రిపోర్ట్: ప్లస్-మైనస్‌లు ఇవే..?

గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.

2019 ఎన్నికల్లో కూడా టీడీపీ టఫ్ ఫైట్ ఇచ్చి వైసీపీ చేతిలో ఓడింది. సుమారు 2500 ఓట్ల తేడాతోనే రోజా గెలిచారు. అలా రెండోసారి గెలిచి అధికారంలోకి రావడం, పైగా ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు..దీంతో ఆమె మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారైనా రోజాని నిలువరించాలనేది టీడీపీ బలమైన కోరిక. కానీ అందుకు తగ్గటుగా నగరి ఇంచార్జ్‌గా ఉన్న గాలి భాను ప్రకాష్ పనిచేయడం లేదు. వైసీపీలో అంతర్గత పోరు ఉన్నా సరే దాన్ని యూజ్ చేసుకోవడం లేదు.

అయితే తాజాగా చంద్రబాబు సైతం..గాలి భాను ప్రకాష్‌కు క్లాస్ ఇచ్చి..అందరినీ కలుపుకుని పనిచేయాలని, నగరిలో గెలిచి తీరాలని సూచించారు. దీంతో అధికారికంగా నగరిలో రోజాపై మళ్ళీ భాను పోటీ చేయడం ఖాయమైంది. ఈ క్రమంలో నగరిలో రోజా-భానులకు సంబంధించిన ప్లస్, మైనస్‌లని ఒకసారి చూస్తే.

రోజాకు ఆర్ధిక, అధికార బలం ఎక్కువ ఉంది. రాజకీయ అనుభవం ఉంది. నగరిలో వైసీపీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉంది. సామాజిక సమీకరణాలు అనుకూలంగా ఉన్నాయి. రెడ్డి, ఎస్సీ వర్గాలు అనుకూలం. మైనస్ వస్తే నగరిలో రోజాకు వ్యతిరేకంగా మూడు మండలాల్లో వ్యతిరేక గ్రూపులు ఉన్నాయి. వారు ఇప్పటికే బహిరంగంగా రోజాపై విమర్శలు చేస్తున్నారు. సీనియర్ నాయకుల్లో రోజా పట్ల అసంతృప్తి ఉంది. అన్నిటికంటే సంక్షేమం బాగుంది గాని అభివృద్ధి లేదు. ఇవే రోజా మైనస్‌లు.

భాను ప్లస్‌లు వస్తే..ప్రధానంగా పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇమేజ్, అనుచరుల బలం ఉంది.  అలాగే భానుకు ఆర్ధిక బలం ఉంది. అలాగే వివాదరహితుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. మైనస్‌లు వచ్చి రోజా మాదిరిగా దూకుడుగా రాజకీయం చేయకపోవడం, కుటుంబంలో విభేదాలు, పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టకపోవడం.

ముఖ్యంగా వైసీపీలో ఉన్న విభేదాలని తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదు. అలా మార్చుకుంటే భాను విజయం సులువు..అటు గ్రూపు తగాదాలని తగ్గించుకుంటే రోజా గెలుపు సులువు. ఏదేమైనా నగరిలో రోజా-భానుల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది.