ఒక వారంలో రెండు విజ‌యాలు.. జ‌గ‌న్ గ్రాఫ్ ఇంత‌ పెరిగిందా..!

కేవ‌లం ఒకే ఒక్క వారంలో.. రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విష‌యాల్లోనూ.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. ప‌లితం ద‌క్క‌లేదు. అస‌లు వీటిని అప్ప‌టి ప్ర‌భు త్వం వ‌దిలేసింది. కానీ, ఇదే విష‌యాల‌పై.. జ‌గన్‌ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌ట్టి సాధించుకుంది. అవే.. ఒక‌టి తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిలు.. రాబ‌ట్టడం.. రెండు.. బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూర‌య్యేలా చేసుకోవ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఏపీలో వెయ్యికోట్ల‌తో బ‌ల్క్ డ్ర‌గ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ప‌ర్మిష‌న్స్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియజేస్తూ లేఖ రాసింది. వారం రోజుల్లోగా త‌మ అంగీకారాన్ని తెలియజేయాల‌ని సూచించింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం రూ.1000 కోట్లు ఆర్థిక సాయం అందించనుంది. 90 రోజుల్లోగా ప్రాజెక్టు డీపీఆర్‌ని కూడా సమర్పించాల్సిందిగా కేంద్రం సూచించింది. మరోవైపు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకోసం 2020 ఆగస్టు లోనే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.

ఇక‌, ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వ‌డ్డీతో సహా క‌లిపి మొత్తం 6,800 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కేంద్రం రెండు రోజుల‌ కింద‌ట ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయని పేర్కొంది.

దీనికి సంబంధించిన 3441.78 కోట్ల రూపాయల బకాయిలతో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది. మొత్తానికి ఈ రెండు ప‌రిణామాలు కూడా.. గ‌తంలో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వీటిని ఇప్పుడు సాధించుకోవ‌డం నిజానికి ఏపీకి క‌లిసి వ‌చ్చే అంశ‌మే. అంతేకాదు.. జ‌గ‌న్ గ్రాఫ్‌ను సైతం పెంచుతాయ‌ని అంటున్నారు.