మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు.

అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ చెప్పారు కాబట్టే ఆ పనిచేశామని పవన్..తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒక కులానికి గంపగుత్తగా అమ్మేస్తున్నారంటూ జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను టీడీపీకి కానీ.. వైసీపీకి కానీ కొమ్ము కాయడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అన్నారు.

అవును పవన్ అన్నట్లు రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలి…ప్రజలు ఎంతసేపు టీడీపీ లేదా వైసీపీ వైపు చూడకుండా మార్పు కోరుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు…కానీ వైసీపీ-టీడీపీలని దాటి మరో పార్టీ బలంగా లేదు. పవన్ కల్యాణ్..జనసేన పార్టీ ఏదో రెండు మూడు జిల్లాల్లోనే బలంగా కనిపిస్తుంది తప్ప..రాష్ట్ర స్థాయిలో బలంగా లేదు. అలాంటప్పుడు ప్రజలు…జనసేన వైపు ఎలా చూస్తారనేది పెద్ద ప్రశ్న…పవన్ అన్నట్లుగా మూడు ప్రత్యామ్నాయం ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించాలి.

సరే రాజకీయంగా మూడో శక్తి కావాలని అంటున్నారు…మరి ఆ దిశగానే పవన్ పనిచేస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. కేవలం వైసీపీనే విమర్శిస్తూ…టీడీపీని ఒక్క మాట అనకపోతే ప్రజలు జనసేన వైపు ఎలా చూస్తారు..మళ్ళీ టీడీపీ వైపే చూస్తారు. కాబట్టి పవన్…వైసీపీతో పాటు టీడీపీని టార్గెట్ చేస్తేనే జనసేన మూడో శక్తిగా ఎదుగుతుంది…లేదంటే తోక పార్టీగానే మిగిలి పోవాల్సి వస్తుంది. అందుకే ముందు పవన్ మారి…తర్వాత మూడో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడితే బెటర్ అని చెప్పొచ్చు.