తారక్‌కు టైమ్ ఉంది…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారని, మరి ఆయన్ని ఎందుకు కలవలేదని వేరే వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి వారి భేటీ రాజకీయ కోణంలోనే జరిగిందని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని…సంచలన వ్యాఖ్యలు చేశారు…మోదీ, షాలు ఉపయోగం లేకుండా ఎవరిని కలవరని, బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని అంటున్నారు.

అలాగే ఏకనాథ్ షిండే మాదిరిగా ఎన్టీఆర్..చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీని తీసుకుంటారని, ఇదంతా బీజేపీ వెనుక ఉండి నడిపిస్తుందని చెబుతున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఏ విధంగా పార్టీని లాక్కున్నారో…ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్..బాబు దగ్గర నుంచి పార్టీని తీసుకుంటారని అంటున్నారు. అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది ఎక్కువ మంది అనుకునే మాట. ఆయన బీజేపీ కోసం పనిచేస్తారా? లేక టీడీపీ పగ్గాలు తీసుకుంటారా? అనేది పక్కన పెడితే…ఓవరాల్ గా ఆయన రాజకీయం చేయబోతున్నారని అనుకుంటున్నారు.

కానీ ఇప్పటిలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఆయనకు దగ్గరగా ఉండే సన్నిహితులు చెబుతున్న మాట. కాకపోతే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తారక్‌కు ఉందని, కానీ దానికి ఇంకా టైమ్ ఉందని, ప్రస్తుతానికి ఆయన సినిమాలపైనే ఫోకస్ పెట్టారని, మరో 10 ఏళ్ల వరకు రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం లేదని, అలాగే బీజేపీకి మద్ధతుగా నిలబడే అవకాశం అంతకంటే లేదని అంటున్నారు.