కుప్పం సరే..ఆ ఎమ్మెల్యేతోనే కష్టం!

మరి జనంలో తమకు బలం ఎక్కువ ఉందని అనుకుంటున్నారో లేక…తమ పథకాలే తమని గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్ కావొచ్చు..వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. మనం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని అడుగుతున్నారు…ఆఖరికి కుప్పంలో కూడా పైచేయి సాధించాం కదా…ఇంకా 175 గెలుచేసుకోవచ్చన్నట్లే జగన్ మాట్లాడుతున్నారు.

జగన్ అన్నది కరెక్టే…కుప్పంలో కూడా వైసీపీనే పైచేయి సాధించింది..పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీలో సైతం వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది…కుప్పం అనే కాదు…రాష్ట్రమంతా ఇదే స్థాయిలో గెలిచింది. అందుకే 175 సీట్లు గెలుచుకోవచ్చు అని జగన్ అనుకుంటున్నారు. అయితే లోకల్ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. లోకల్ ఎన్నికలు ప్రజా బలం కంటే అధికార బలంతోనే గెలిచారని చెప్పొచ్చు. ఎంత కాదు అనుకున్న ఇందులో నిజం చాలానే ఉంది. కేవలం ప్రజా బలం వల్లే లోకల్ ఎన్నికల్లో ఇంతగా భారీ విజయాలు వచ్చాయా? అంటే నమ్మడం కష్టమే. అధికార బలం వల్ల కూడా విజయాలు వచ్చాయి.

మరి అలాంటప్పుడు సాధారణ ఎన్నికల్లో అధికార బలంతో గెలవడం చాలా కష్టం. అసలు 175కి 175 సీట్లు సాధించడం చాలా కష్టమైన పని…ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కాబట్టి భారీ విజయం అనేది సులువు కాదు…అంతఎందుకు పంచాయితీ, పరిషత్ ల్లో గెలిచిన వైసీపీ.. కుప్పం అసెంబ్లీ సీటులో గెలుస్తుందా? అంటే చెప్పలేం.

కుప్పం సంగతి పక్కనపెడితే…పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని వైసీపీ ఓడించడమే చాలా కష్టమని విశ్లేషణలు వస్తున్నాయి…అధికారంలో ఉన్న, లేకపోయినా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నిమ్మల లాంటి నేతలని ఓడించడం వైసీపీకి కష్టమైన పని అని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి 175 అనేది ఒక కలే అంటున్నారు.