పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఆపేదెవరు?

రాజకీయంగా జగన్ వల్ల చంద్రబాబు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు గాని…సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల మాత్రం బాబుకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. అసలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి దూకుడు వల్ల టీడీపీ దారుణంగా నష్టపోతుంది. జిల్లాని పెద్దిరెడ్డి తన గ్రిప్ లో పెట్టుకుని, వైసీపీని మరింత బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లోనే 14 స్థానాలకు గాను…13 స్థానాలు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సారి కుప్పంని కూడా కైవసం చేసుకుని 14 స్థానాలు గెలుచుకోవాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు.

ఇప్పటికే కుప్పం టార్గెట్ గా పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే…అక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇలా తన సొంత జిల్లాలోనే చుక్కలు ఛూపిస్తున్న పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని చంద్రబాబు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని నిలువరించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీపై బలమైన అభ్యర్ధులని నిలుపుతూ వస్తున్నారు.

ఇప్పటికే పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రత్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డిని ఫిక్స్ చేశారు. అటు రాజంపేట పార్లమెంట్ లో పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి పోటీగా వ్యాపారవేత్త గంటా నరహరిని నిలబెట్టనున్నారు. అలాగే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్ళపల్లెలో…ఇప్పుడు ఉన్న ఇంచార్జ్ శంకర్ యాదవ్ ని పక్కన పెట్టి..మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారు.

అంటే ఎక్కడకక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నారు. అయితే ఎంతో బలంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టడమనేది చాలా కష్టమైన పని. మూడు చోట్ల పెద్దిరెడ్డి ఫ్యామిలీ బలంగా ఉంది…కొద్దో గొప్పో తంబళ్ళపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఉంటుందేమో గాని..పుంగనూరు, రాజంపేటల్లో అసలు ఛాన్స్ ఉండదు. అయితే ఇప్పుడు తంబళ్ళపల్లెలో కూడా ద్వారకానాథ్ స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి…పెద్దిరెడ్డి ఫ్యామిలీని నిలువరించడం బాబుకు సాధ్యం కాదు.