అనగానికి మోపిదేవి వారసుడుతో చెక్?

తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి… ఆ స్థానాల్లో టీడీపీకి ఓటమి కంటే గెలుపే ఎక్కువసార్లు వచ్చింది. అలాగే ప్రత్యర్ధులు ఎంత గట్టిగా ట్రై చేసిన సరే కంచుకోటల్లో టీడీపీకి చెక్ పెట్టడం అనేది అసాధ్యమై పోతుంది…అయితే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ కంచుకోటలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. టీడీపీ కంచుకోటల్లో బలపడటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసుకుంటూ వెళుతుంది..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తుంది.

ఇదే క్రమంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపల్లె నియోజకవర్గంలో పాగా వేయాలని వైసీపీ చూస్తుంది. రేపల్లెలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు..1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతుంది. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది…ఇక మిగిలిన అన్నీ సార్లు టీడీపీ గెలిచింది. చివరి రెండు ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీదే పైచేయి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ గెలుస్తూ వస్తున్నారు..మోపిదేవి వెంకటరమణ ఓడిపోతూ వస్తున్నారు.

అయితే ఈ సారి రేపల్లెలో అనగానికి ఖచ్చితంగా చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది…ఈ క్రమంలోనే మోపిదేవి వారసుడుని ఇక్కడ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోపిదేవి ఓడిపోయాక ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి…ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో జగన్…మోపిదేవికి రాజ్యసభ ఇచ్చారు.

ఇక మోపిదేవి రాజ్యసభకు వెళ్ళడంతో…నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తన వారసుడుని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి వారసుడు రాజీవ్…రేపల్లెలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అక్కడ పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా గాని ఈ సారి రేపల్లెలో మోపిదేవి వారసుడు బరిలో దిగనున్నారు. అయితే అనగానికి ఇక్కడ బలం ఎక్కువే…పైగా రాష్ట్రంలో నిదానంగా టీడీపీ బలం పెరుగుతుంది…ఇక రేపల్లె ఎలాగో టీడీపీకి కంచుకోట. మరి ఇలాంటి పరిస్తితుల్లో అనగానికి మోపిదేవి వారసుడు ఏ మేర చెక్ పెడతారో చూడాలి.