RRR… చెప్పేదొకటి చేసేదొకటి!

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం సినిమా లోకం మొత్తం ఈ పేరుతో మార్మోగిపోతుంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతోంది ఈ సినిమా.

ఇప్పటికే ఓవర్సీస్‌లో 2 మిలియన్ మార్క్ ప్రీ-బుకింగ్ సేల్స్‌తో అదరగొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రం, ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అన్ని నగరాల్లోనూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాను 3Dలో చూస్తే వచ్చే అనుభూతి మామూలుగా ఉండదని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను త్రీడీలో చూడండి అంటూ చిత్ర యూనిట్ గొప్పగా చెబుతూ వచ్చింది.

కానీ వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో 3D టికెట్లను చాలా అంటే చాలా తక్కువగా అందుబాటులో పెట్టారు థియేటర్ యాజమాన్యాలు. 2D టికెట్లతోనే లాభాలను గడించాలని చూస్తూ, 3D అనుభూతిని పక్కనబెట్టేశారు. దీంతో ఈ సినిమాను విజువల్‌గా ఎంజాయ్ చేయాలని చూసే 3D లవర్స్‌కు తీవ్ర నిరాశే మిగులుతోంది. అయితే చిత్ర యూనిట్ చెప్పినట్లుగా ఈ సినిమాను 3Dలో చూద్దామంటే కూడా ఎక్కడా 3D టికెట్స్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తోంది. మరి చిత్ర యూనిట్ ఈ విషయంపై ఏదైనా స్పందిస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 3D లవర్స్ కోసమైనా ఈ సినిమా షోలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.