దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న సితార హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారట.
ఆ రెస్టారెంట్‌లోనే అజిత్ కూడా భోజనం చేస్తున్నారట. అయితే రాజమౌళి వచ్చారని తెలుసుకున్న అజిత్.. భోజనం మధ్యలోంచి లేచి జక్కన్న దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఆయన్ను లోపలికి తీసుకెళ్లారట. ఇక అంతలోనే లంచ్‌కి రాజమౌళి భార్య రమ కూడా వస్తుందని తెలిసి.. అజిత్ మళ్లీ లేచి డోర్ దగ్గరికి వెళ్లి `నేను అజిత్` అని పరిచయం చేసుకుని ఆమెను కూడా లోపలికి తీసుకొచ్చారట.
అంత పెద్ద స్టార్ అలా చేయడంతో రాజమౌళికి ఎంతో ఇబ్బందిగా అనిపించిందట. అంతే కాదు, అజిత్ సింప్లిసిటీని చూసి రాజమౌళికి మతిపోయిందట. దాంతో ఏం మాట్లాడాలో కూడా ఆయనకు అర్థం కాలేదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తెలుపుతూ అజిత్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఇప్పుడీయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.