నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపులతో నిన్నంతా సందడి వాతావరణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్‌తో పాటుగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా ద్వారా అఖండపై రివ్యూ ఇచ్చారు. `సినిమా చూడటం పూర్తయిందని, మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్‌కి అభినందనలు. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి సినిమాలో చాలా మూమెంట్స్ ఉన్నాయి` అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.
దీంతో ఎన్టీఆర్ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. దాన్ని చూసిన నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. కాగా, ఎన్టీఆర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
Just finished watching #Akhanda. Congrats Bala Babai and the whole team on scoring this resounding success.
So many hardcore fan moments to enjoy !!
— Jr NTR (@tarak9999) December 2, 2021