ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయాలని వర్సిటీ అధికారులను సర్కారు ఆదేశించింది.

దీంతో వర్సిటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన నిధులను ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? అందుకు మీరెలా ఒప్పుకుంటారని రిజిస్ర్టార్, వీసీలను ప్రశ్నించింది. వారు కూడా చేతులెత్తేయడంతో నిరసన బాట పట్టారు ఉద్యోగులు. వర్సిటీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్, వారి సంక్షేమానికి కేటాయించిన నిధులను గవర్నమెంటుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వర్సిటీ ప్రాంగణంలో రోజూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఉద్యోగులు, విద్యార్థులు.. వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులేకపోతే వేరే మార్గాలను అన్వేషించాలి..ఎక్కడైనా తీసుకోవాలి.. అంతేగానీ మాకోసం ఉన్న డబ్బును మీరెలా తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇపుడు ఆ నిధులను మీరు తీసుకుంటే అవసరమైనపుడు ఇస్తారా? మేమెలా నమ్మాలి? మా పరిస్థితేంటని వాపోతున్నారు.