నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కొనసాగిస్తోంది.
ఈ క్రమంలోనే బాలయ్య సెంచరీ కొట్టి అరుదైన ఘనత సాధించారు. అఖండ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. దీంతో బాలయ్య కెరీర్‌లో వంద కోట్లు గ్రాస్ అందుకున్న తొలి చిత్రంగా అఖండ నిలిచింది. ఇప్పటిదాకా బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గౌతమీపుత్ర శాతకర్ణినే. అయితే ఈ సినిమా కలెక్షన్లను తొలి వారంలోనే అఖండ దాటేసింది.
రూ. 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన అఖండ తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.58 కోట్లు వసూలు చేసింది. మరియు వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఇక ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపే రేంజ్ లో లేవు. దీంతో ఈ వారం కూడా మాస్ జాతర అఖండ దే అని చెప్పాలి.
కాగా, అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు.