దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ లోకమంతా ఆర్ఆర్ఆర్ జపం చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 26 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటినుంచే అందరూ ఆ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా మరో ఐదు రోజుల్లో అంటే డిసెంబర్ 17 వ తేదీ విడుదల కానుంది. ముందు నుంచీ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నప్పటికీ.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల అయ్యాక దేశమంతా ఆ సినిమా ట్రైలర్ గురించే మాట్లాడుకుంటోంది. దానికి తోడు రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్,అలియా భట్ వరుసపెట్టి ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్నారు.
ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో వరుసగా మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతోంది.యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇది పుష్ప సినిమాపై ప్రభావం చూపుతోంది. దీంతో పుష్ప సినిమాకు ముందున్న బజ్ ఇప్పుడు కనిపించడం లేదు. మరో ఐదు రోజుల్లో పుష్ప విడుదల కానుండడంతో ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఈ మూవీపై పడే అవకాశం ఉంది.
దీంతో అల్లు అర్జున్ నేరుగా రంగంలోకి దిగాడు. నిన్న రాత్రి అల్లు అర్జున్, రష్మిక మందన్న కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి ఇంకా టీవీ ఛానళ్లలో ప్రసారం కాలేదు. ఇవాల్టి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు పుష్ప టీం భారీగా ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించుకుంది. పుష్ప సినిమా 17వ తేదీన తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో రూ.250 కోట్లు చేసింది.