గుర్తుందా గురూ..మరి ఇప్పుడు .. మండలితో ప్రయోజనం ఉంటుందా?

’రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉంది.. దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదు..దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం కూడా దండగ.. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది. సీన్ కట్ చేస్తే.. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.. శాసనమండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కోటా నుంచి 3, స్థానిక సంస్థల కోటా నుంచి 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

విచిత్రమేమంటే.. ఏపీలో మండలి వద్దు.. రద్దు చేస్తున్నాం.. తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నాం అన్న పాలకులే ఇపుడు అదే మండలి సీట్ల కోసం పోటీ పడుతున్నారు. పార్టీలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ సీట్ల కోసం ప్రయత్నించారు. అధినేత అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు.. ఈ మండలినుంచి కొంచెం కూడా ప్రయోజనం లేదు.. అసెంబ్లీ చేసిన తీర్మానాలను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకుంటోంది.. ఇది అవసరమా.. అని ఆవేశంగా మాట్లాడారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ మండలి రద్దుకు ఆమోదం తెలిపారు. మరి.. ఆ తీర్మానం ఏమైందో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందో, లేదో తెలియదు? ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి.. పోటీచేస్తున్నారు..వద్దన్న పార్టీనే సభ్యులను మండలికి పంపుతోంది. మరి ఇపుడు ప్రయోజనం ఉంటుందా? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.