సారూ.. ఇందిరా పార్కు మిమ్మల్ని చూసి నవ్వుతోంది

ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తారు.. ఎక్కడంటే అక్కడ కాదు.. ధర్నా చౌక్.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు.. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎందరో..ఇంకెందరో ఇందిరాపార్కు వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లారు.. తీసుకెళుతున్నారు కూడా. ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అక్కడ ఆందోళనా కార్యక్రమాలు చేయరాదని గతంలో నిషేధించింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తరువాత నిషేధం సడలించారు. అనంతరం ధర్నా చౌక్ లో మామూలుగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇపుడు విషయమేంటంటే.. ఏ ప్రాంతంలో అయితే ధర్నాలు, నిరసనలు చేయరాదని ప్రభుత్వం నిషేధించిందో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థలంలోనే ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యపరుస్తోంది. వరిని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గులాబీ శ్రేణులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తారు. ఇందుకు పార్టీలో నెంబర్ 2. కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. వద్దు.. వద్దు అన్న ప్రాంతంలోనే సర్కారు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం పార్టీ శ్రేణులను కూడా నివ్వెరపరుస్తోంది. ఏదేమైనా ధర్నా చౌక్ బాధితులకు అండగా నిలబడుతోంది.