అన్న దూరం పెట్టినోళ్లంతా చెల్లెలు చెంతకు..!

కారణాలు ఏవైనా కావొచ్చు గాక.. అన్నయ్య వారిని దూరం పెట్టాడు. ఒకప్పట్లో వారందరూ కూడా ఆ అన్నయ్య కోసం, అన్నయ్యను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం కోసం అహరహమూ పరితపించిన వారే. కానీ.. వారందరినీ అన్నయ్య దూరం పెట్టాడు! కాలక్రమంలో వారిలో చాలా వరకు తెరమరుగే అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వారందరికీ కొత్త ఆదరవు దొరికినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానంటూ షర్మిల పెట్టిన రాజకీయ పార్టీకి ఎవరెవరి మద్దతు ఉండబోతోందో గానీ.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆమె హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమానికి మాత్రం పలువురు పెద్దలు హాజరయ్యారు.

గురువారం ఉదయం ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో అన్న జగన్ తో కలిసి పాల్గొన్న షర్మిల.. ఆమె తల్లి విజయమ్మ సాయంత్రం హైదరాబాదులో మరో కార్యక్రమం నిర్వహించారు. నొవాటెల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ కు అప్పట్లో సన్నిహితులైన అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో వైఎస్సార్ ఆత్మగా తెలుగు ప్రజలందరూ గుర్తించిన కేవీపీ రామచంద్రరావు, వైఎస్సార్ మేథో సంపదగా గుర్తింపు ఉన్న ఉండవిల్లి అరుణ్ కుమార్, వైఎస్సార్ మరణం తర్వాత.. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరు ఎమ్మెల్యేల సంతకాలను అప్పటికప్పుడు సేకరించడంలో కీలక పాత్ర పోషించిన రఘువీరారెడ్డి ఉన్నారు. వీరు ముగ్గురూ ఏపీకి చెందిన నాయకులే అయినప్పటికీ.. రాజకీయ దురంధరులు.

వైఎస్సార్ కు వీరు ఎంతో సన్నిహితులనే పేరు అప్పట్లో ఉండేది. అయితే వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ ప్రారంభించిన తర్వాత.. కొన్నాళ్లు వీరి గురించి పట్టించుకున్నప్పటికీ తర్వాత పూర్తిగా దూరం పెట్టారు. కేవీపీ ఆ కుటుంబానికి అంత సన్నిహితంగా ఉండేవారే అయినా.. జగన్ పార్టీలో అస్సలు ప్రాధాన్యం లేకుండా పోయింది. పుష్కలమైన విషయపరిజ్ఞానంతో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఉండవిల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి కొంత దగ్గర కావడానికి ప్రయత్నించారు గానీ.. జగన్ దూరం పెట్టారు. రఘువీరా సంగతి సరేసరి. వీరంతా తెలంగాణ రాజకీయాలతో ప్రత్యక్షంగా ప్రభావం చూపేవారు కాకపోయినా.. వ్యూహచతురతలో నిపుణులు. అలాంటి వారు.. జగన్ మోహన్ రెడ్డి తమను దూరం పెట్టిన తర్వాత.. ఇప్పుడు షర్మిల పెట్టిన పార్టీ తెర వెనుకకు చేరుతున్నట్లుగా ఈ వర్ధంతి సభను బట్టి సంకేతాలు అందుతున్నాయి.

తెలంగాణ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జితేందర్ రెడ్డి వంటి నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తానికి షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీతో ఎంత మేర ప్రభావం చూపించగలదో తెలియదు గానీ.. కీలక నాయకులు మాత్రం ఆమెకు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది.