హస్తినలో అధినేత సైలెంట్.. ఎందుకో..?

దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన.. గులాబీ శ్రేణుల సంబరాలు.. రాష్ట్రం నుంచి ముందుగానే హస్తినకు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు.. వర్షం వస్తున్నా హంగామా.. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఏర్పాట్ల పర్యవేక్షణ.. ఇంత పెద్ద.. గొప్ప ప్రారంభ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ వేదికగా పార్టీకి ఏం దిశానిర్దేశం చేస్తారో? దేశానికి టీఆర్ఎస్ తరఫున ఏం చెబుతారో? అని అందరూ ఎదురు చూశారు. ముఖ్యంగా జాతీయ మీడియా కేసీఆర్ స్పీచ్ కోసం మైకులు సిద్ధం చేసుకొని చూసింది. సారొచ్చారు.. పూజ చేశారు.. వెళ్లారు.. అంతే.. ప్చ్.. మాట్లాడలేదు. దీంతో పార్టీ శ్రేణులు, మీడియా నిరాశచెందింది.

పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు, ముఖ్య అతిథి కేసీఆర్ అయినపుడు, సందడిగా ఉన్నపుడు ఆయన మైకు తీసుకొని సభికులను ఉత్సాహపరిచే ప్రసంగం చేస్తారు. కేసీఆర్ మాటల తూటాల కోసం జనం కూడా అలాగే ఎదురు చూస్తారు. ఒక్క తెలంగాణనే కాదు.. ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా వింటారు. మరి అటువంటి కేసీఆర్ ఎందుకో సైలెంటుగా ఉండిపోయారు. దక్షిణాదిలోనే ఏ పార్టీ చేయని కారు పార్టీ ఢిల్లీలో సందడి చేసింది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ రాజధానిలోనే ఉండిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో గురువారం కార్యకర్తలు మాత్రమే ఉండిపోయారు. శంకుస్థాపన జరిగే వేదిక వద్దకు కేసీఆర్ వచ్చినపుడు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.. వెళ్లేటపుడు వీడ్కోలు పలికారు.. మధ్యలో పూజలు చేశారు.. అంతే..ఇక చేసిందేమీ లేదు. అసలు సారు మాట్లాడకపోవడానికి కారణమేమై ఉంటుందబ్బా అని కారు పార్టీ నాయకులే కాదు ఇతర పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారట.