పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?

September 3, 2021 at 1:05 pm

తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే మంత్రం తెలిసిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు పేరుంది. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా దీదీ కోసం పనిచేసి.. ఆమెను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రశాంత్ కిశోర్ .. ఇక రాజకీయ వ్యూహరచనల ప్రస్థానం చాలిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్త బలంగా వినిపిస్తోంది.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరడానికి సంబంధించి ప్రాథమిక కసరత్తు మొత్తం పూర్తయినట్టే. ఆయన చేరిక విషయంలో సోనియా నిర్ణయం ప్రకటించడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే నానా రకాలుగా తూట్లు పడి మునిగిపోయే నావలా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తెడ్డు వేసి ఏ రకంగా తీరానికి చేరుస్తాడా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

పీకే గతంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేసినా సత్ఫలితం లభించలేదు. అదే సమయంలో పంజాబ్ ఎన్నికల విజయం ఆయనమీద మరక పడకుండా కాపాడింది. తొలుత మోడీకోసం పనిచేయడం ద్వారా పాపులర్ అయిన పీకే తర్వాత.. బీహార్లో నితీశ్ కుమార్ పార్టీలో చేరి ఆయన వారసుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పార్టీని వీడిపోయాడు. మమతా దీదీ పార్టీకోసం పనిచేసినప్పుడు, ఆ పార్టీలో చేరుతారనే ప్రచారమూ జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికోసం కూడా పీకే దళం గత ఎన్నికల్లో పనిచేసింది.

ఇంత జరిగిన తర్వాత.. పీకే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. ముందుముందు ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదు. మరి ఇలాంటి సమయంలో ఆ పార్టీలో చేరితేనే.. తన వ్యూహాల వల్ల కొంచెం ఫలితం కనిపించినా తనను నెత్తిన పెట్టేసుకుంటారని పీకే అనుకుంటున్నారేమో తెలియదు. ఆయన ఆలోచన ఎలా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ లోకి ఎంట్రీ అంత ఈజీగా జరిగేలా లేదు. చాలా మంది సీనియర్లు పీకే రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్, సోనియా-రాహుల్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సీనియర్లు కూడా పీకే రాకను ఇష్టపడడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇంతమంది మోకాలడ్డుతున్నప్పటికీ.. ఒకవేళ ఆయన ఆ పార్టీలో ప్రవేశించినా కూడా.. అనుకున్నట్టుగా.. పార్టీకోసం మంచి ఫలితాలు సాధించగలరా అనేది పలువురి సందేహం.

ఒకసారి మోడీ కోటరీనుంచి బయటకు వెళ్లిన తర్వాత.. భాజపాయేతర పార్టీలు అనేకులతో కలిసి పనిచేసిన పీకే.. కాంగ్రెస్ లో కీలకంగా ఉంటే గనుక.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి.. భాజపాయేతర కూటమిని బలంగా తయారు చేయడంలో భూమిక పోషిస్తారనే అభిప్రాయం పలువురిలో ఉంది. మరి పీకే రాక విషయంలో సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనో చూడాలి.

పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?
0 votes, 0.00 avg. rating (0% score)