ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం చూపుతుందని చైనా దేశం ఆన్లైన్ గేమ్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

18 ఏళ్ల లోపు వారు వారంలో కేవలం మూడు గంటలు మాత్రమే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుకునే లా కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. అలాగే సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్ ఆడుకోవడానికి అనుమతినిచ్చింది. అది కూడా రాత్రి 8 నుంచి 9 గంటల సమయం మధ్యలోనే ఆడుకోవాలి. మిగతా సమయంలో పిల్లలు గేమ్స్ ఆడకుండా చర్యలు తీసుకోవాలని గేమింగ్ కంపెనీలను చైనా ఆదేశించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.